దేశచరిత్రలోనే తొలిసారి మీడియా ముందుకు జడ్జీలు-పాలనపై అసంతృప్తి

భారత న్యాయచరిత్రలోనే అరుదైన ఘటన…గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు పనితీరుపై వీరు నలుగురూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని వీరు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీ జాస్తి చలమేశ్వర్ నివాసంలో ఆయనతో పాటుగా న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసేఫ్ లు సమావేశమయ్యారు. వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అత్యంత కీలకమైన ఈ భేటి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సక్రమంగా లేదని వీరు కుండబద్దలు కొట్టారు. పాలనా వ్యవస్థను చక్కదిద్దాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరినప్పటికీ ఆయన్ని తాము ఒప్పించలేకపోయామని చెప్పారు. దీనిపై తమకు మరో మార్గం కనిపించక మీడియా ముందుకు వచ్చినట్టు వారు వివరించారు. స్వేచ్ఛాయత న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని వారన్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ జడ్జీలు సమావేశం కావడం తదనంతరం మీడియాతో మాట్లాడడం సంచలనం రేపుతోంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *