వర్మకు వాణీ విశ్వనాథ్ వార్నింగ్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినీ నటి వాణీ విశ్వనాథ్ వార్నింగ్ ఇచ్చారు. వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర నిర్మాణాన్ని వెంటనే ఆపి వేయాలని లేకుంటే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతానంటూ హెచ్చరించారు. వర్మ తీయబోతున్న చిత్రం ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తికి కళంకం తెచ్చేదిగా కనిపిస్తోందని అదే జరిగితే వర్మ ఇంటి ముందు ఆందోళనకు దిగుతానంటూ వాణీ విశ్వనాథ్ హెచ్చరించారు. ఎన్టీఆర్ సరసన నటించిన నటిగా, ఆయన అభిమానికిగా తాను చెప్తున్నానని వర్మ వెంటనే తన చిత్ర నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. వర్మ తీస్తానని చెప్తున్న చిత్రం పేరులోనే వివాదం, వ్యాపారం దాగున్నాయని అన్నారు. రాముడి సినిమా తీస్తూ రావణ అని, కృష్ణుడి సినిమా తీస్తూ కంసా అని, గాంధీ సినిమా తీస్తూ గాడ్సే అని పేరు పెట్టం కదా అని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రపై చిత్రాన్ని తీసేందుకు ఆయన తనయుడు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఈ సమయంలో వర్మ వివాదాస్పంద పేర్లతో చిత్రాన్ని తీయడం సమంజసం కాదని అన్నారు. తెలుగు ప్రజలందరికీ ఎన్టీఆర్ ఆదర్శప్రాయుడని అటువంటి వారి వ్యక్తిత్వాన్ని కించపర్చే లాగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *