తెలంగాణలో గ్రహాంతర వాసుల వార్త నిజం కాదు


ఆదిలాబాద్ -మంచిర్యాల జిల్లాల్లోని జిన్నారం అటవీ ప్రాంతంలో గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారంటు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. జిన్నారం అటవీ ప్రాంతంలోకి గ్రహాంతర వాసులు ప్రవేశించారని వారు ఇక్కడి అటవీ ప్రాంతంలోని గొర్రెలను చంపినట్టుగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అటవీశాఖ అమర్చిన సీసీ కెమేరాల్లో ఈ చిత్రాలు చిక్కాయంటూ జరుగుతున్న ప్రచారంతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్దపు ప్రచారంగా తేలిపోయింది. ప్రచారంలో ఉన్న దృశ్యాలు తమ సీసీ కెమేరాలకు సంబంధించినవి కావని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాము ఎటువంటి చిత్రాలను విడుదల చేయలేదని వారు పేర్కొన్నారు. ప్రచారంలో ఉన్న చిత్రాలను చూస్తుంటే అవి గ్రాఫిక్స్ మాయాజాలంగా స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చిత్రాలు ప్రచారం అవుతున్నాయి. గొర్రెలు చనిపోయిన చిత్రాలకు సంబంధించి స్థానిక అటవీ అధికారులు స్పందిస్తూ అసలు అటువంటి ఘటనలు జిన్నారం అటవీ ప్రాంతంలో జరగలేదని స్పష్టం చేశారు. జిన్నారం అటవీ ప్రాంతంలో చిత్రంలో కనిపించినట్టు వెదురు పొదలు లేవని తెలిపారు. ప్రచారంలో ఉన్న చిత్రం జిన్నారం అటవీ ప్రాంతానికి చెందినది కాదని వారు తేల్చి చెప్పారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న గొర్రెలు చనిపోయిన చిత్రం ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా నైలీ ప్రాంతంలో గతంలో జరిగిన ఒక ఘటనకు సంబంధించినదిగా తెలుస్తోంది. స్థానిక గ్రామంపై దాడిచేసిన గుర్తుతెలియని జంతువు పెద్ద సంఖ్యలో గొర్రెలను చంపిన చిత్రాన్ని మరికొన్ని గ్రాఫిక్స్ చిత్రాలను జోడించి పెద్ద ఎత్తున గ్రహాంతర వాసులుగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు సైతం ఈ వార్తను నిజమైన వార్తగా చిత్రీకరించి ప్రచారం చేస్తుండడంతో వీటికి మరింత ప్రాచూర్యం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *