స్థంభం ఎక్కిన చిరుత-షాక్ తో మృతి

అడవిలో నుండి బయటకు వచ్చిన చిరుత కరెంటు షాక్ గురై చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ మల్లారం అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చిన చిరుత ఎందుకు ఎక్కిందో తెలియదు కానీ ఏకంగా విద్యుత్ స్థంబాన్ని ఎక్కేసింది. అక్కడి కరెంటు వైర్లను తాకడంతో షాక్ కు గురై స్థంబం పైనే చనిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కరెంటు వైర్లలో చిక్కుకుని మరణంచిన చిరుతను కిందకు దింపారు. స్థానిక మల్లారం అటవీ ప్రాంతంలో సుమారు ఆరు చిరుతలు ఉన్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు. ఆహారం కోసం వచ్చిందా లేక దారి తప్పి వచ్చిందో తెలియదు కానీ అరణ్యం వదలి జనావాసాల్లోకి వచ్చిన చిరుత చివరకు కరెంటు తీగలకు బలైంది.

ఒక నెమలిని తరుముకుంటూ చిరుత వచ్చిందని నెమలి కరెంటు తీగలపై వాలడంతో దాన్ని పట్టుకునే క్రమంలో చిరుత కూడా కరెంటు స్థంబాన్ని ఎక్కిందని అంటున్నారు. అయితే చిరుత చాలా నేర్పుగా చెట్లు ఎక్కగలదని సాధారణంగా చిరుతలు వేటాడే ముందు ఎత్తైన ప్రదేశాల్లో ఉండి చుట్టుపక్కల ఆహారాన్ని వెతికే అలవాటు ఉంటుందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరుత స్థంబాన్ని ఎక్కి ఉండవచ్చని భావిస్తున్నారు. చిరుత కరెంటు షాక్ తగిలి మృతి చెందిన వార్త తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థాలానికి తరలివచ్చారు. చిరుత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు దాన్ని ఖననం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *