టీనేజీ పిల్లల తల్లిదండ్రులు జర జాగ్రత్త

తీగలాగితే డొంక కదులుతోంది… డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వివరాలు లాగితే స్కూల్ పిల్లల వ్యవహారం వెలుగులోకి వచ్చింది… డ్రగ్స్ కు అలవాటు పడ్డ స్కూల్ విద్యార్థులు ఒకరిద్దరు కాదు. వారి సంఖ్య భారీగానే ఉందనే విషయం నగరంలోని స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో వణుకుపుట్టిస్తోంది. పట్టుమని పదమూడు, పద్నాలుగు సంవత్సరాల వయసు లేని పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఖరీదైన డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ ముఠాను పట్టుకున్న తెలంగాణ ఎక్సైజ్ శాఖ దీనిపై మరింత లోతుగా విచారణ జరిపితే అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయనే వాస్తవం కలవరపెడుతోంది. ఎంత మంది పిల్లలు ఈ వ్యసనానికి బానిసలుగా మారారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్ స్థాయి నుండే విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడడం ఎవరి తప్పు… అడినంత డబ్బులిచ్చి కనీసం పిల్లను పట్టించుకోని తల్లిదండ్రులదా… ఫీజులు దండుకోవడం తప్పిస్తే స్కూల్ లో ఏం జరుగుతోందో తెలుసుకోని యాజమాన్యాలదా…పిల్లలకు సైతం ప్రమాదకర డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నా గుర్తించలేని ప్రభుత్వానిదా… తప్పేవరిదైనా నాశనం అవుతోంది మాత్రం విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తే. ఖరీదైన డ్రగ్స్ ఒక డోసు ధర సుమారు రెండు నుండి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. మరి అంత డబ్బులు పిల్లల దగ్గర ఎక్కడివి. ఇంట్లో తెలియకుండా అంత డబ్బులు తీసుకుని వస్తున్నారా లేక తల్లిదండ్రులే అడిగినంత పాకెట్ మనీ ఇస్తున్నారా… ఒక్క డ్రగ్స్ కే కాదు బ్లూ ఫిలింలు చూడడం దగ్గర నుండి అన్ని అవలక్షణాలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారు. పిల్లలను పట్టించుకునే కనీస తీరక లేని తల్లిదండ్రులు …చేతినిండా డబ్బు… అందుబాటులో ఇంటర్నెట్ … ఇవి చాలవా పిల్లలను వ్యసనాల వైపు లాగడానికి. పిల్లలపై ప్రేమ పేరుతో అడినంత డబ్బులిచ్చే తల్లిదండ్రులు ఇకనైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది.

హుక్కా నుండి మొదలై డ్రక్ వరకు ఈ దురలవాటు దారితీస్తోంది. అసలు డ్రగ్స్ అలవాటు పడిన పిల్లలు ఎంత మంది ఉన్నారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *