మౌనముని…జ్ఞాన ఘని…

పి.వి.నరసింహా రావు… భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశీలి. చిన్నాభిన్నంగా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పి.వి. తీసుకుని వచ్చిన ఆర్థిక సంస్కరణల మూలంగానే దేశ ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటి దక్షిణాని ప్రధానిగా అనేక ఆటోపోట్లు ఎదురైనా అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆయన రాజకీయ చాణుక్యానికి కొమ్ములు తిరిగిన నేతలు సైతం దాసోహం అన్నారు. పూర్తి మెజార్టీ లేకపోయినా సంకీర్ణ సర్కారును సమర్థవంతంగా నడిపి తాను అనుకున్నది సాధించుకున్న ధీశాలి పి.వి. రాజకీయ వేత్తగానే కాదు సాహితీ మూర్తిగా, బహుముఖ భాషా కోవిదుడిగా పేరుపొందిన పి.వి.నరసింహారావు తెలుగు వారు కవడం మనందరికీ గర్వకారణం.

  •  పి.వి.నరసింహారావు. గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు.
  • భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగు వాడు, పాములపర్తి వెంకట నరసింహారావు. . భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.
  • 1957లో శాసనస భ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు.
  •  వరంగల్ జిల్లా,నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతుల కు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు.
  • కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు.
  • 1938 లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు.
  • ఒక  మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు.
  • స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.
  • 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
  • ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. అటు తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  •  ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైన దేమీ కాదు.పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది.ఈ విషయమై అధిష్టానం తో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది.
  • ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్తమంత్రుల ను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు.
  • ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపర చేందుకు చర్యలు తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
  •  తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
  •  లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం. మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
  • ప్రధానమంత్రిగా పీవీ ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోద యోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు.
  • ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.
  • పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు,సంస్కరణలకు బీజంవేసాడు.
  • తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
  • పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే.
  • ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
  • 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు .
  • బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగ లిగిన ప్రజ్ఞ ఆయనది.1983 అలీన దేశాల  శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి  క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను  అబ్బుర పరచాడు.
  • రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరు ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
  • ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది “ఇన్‌సైడర్” అనే ఆయన ఆత్మకథ. ‘లోపలిమనిషి ‘గా ఇది తెలుగులోకి అనువాదమైనది.
  • సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ  వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
  • అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో  అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.

నేడు పీవీ జయంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *