దాసరి అంత్యక్రియలు పూర్తి

సినీదర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు అంత్యక్రియలు ముగిశాయి. మోయినాబాద్ మండలంలోని తోల్కట్టలోని దాసరి ఫాం హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్ నుండి మోయినా బాద్ వరకు నిర్వహించిన దాసరి అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు మోయినాబాద్ కు తరలివచ్చారు. దాసరి నారాయణ రావు సతీమణి పద్మ సమాధి పక్కనే దాసరి అంత్యక్రియలను నిర్వహించారు.

అంతకు ముందు దర్శక రత్న దాసరి నారాయణ ను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో సినీ,రాజకీయ ప్రముఖులతో పాటుగా సినీ కార్మికులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. దాసరి నారాయణ రావు బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దాసరి అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాసర నారాయణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినీ కార్మికులు దాసరి మరణంతో ఒంటరి వాళ్లమయ్యామంటూ కంట తడిపెట్టారు. దాసరి బౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన వారంతా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ దాసరి ముందుకు వచ్చేవారని వారు గుర్తు చేసుకున్నారు.

దర్శకుడిగా,రచయితగా,నటుడిగానే కాకుండా సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి మరణం పరిశ్రమకు తీరని లోటని సినీ వర్గాలు అంటున్నాయి. చిన్న సినిమాలకు ఎప్పుడూ అండగా ఉండే దాసరి చిన్న నిర్మాతల కోసం తపించే వారని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *