అతిపెద్ద వంతెన ప్రారంభం

modi_759

దేశంలోని అతి పెద్ద బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 9,15 కిలోమీటర్లు. ఈశాన్య రాష్ట్రాలు అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన వల్ల ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ఐదు గంటలకు పైగా సమయం ఆదా అవుతుంది. చైనాకు సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వాసులకు ఈ వంతెన ఉపయోగకరంగా ఉంటుంది. విమాన, రైలు సౌకర్యాలు లేని మారుమూల రాష్ట్రానికి దేశంలోని ప్రధాన నగరాలకు ఈ వంతెన అనుసధానం కానుంది. దీని ద్వారా అస్సోంలోని రైలు, విమాన సౌకర్యాలను అరుణాచల్ ప్రదేశ్ వాసులు ఉపయోగించుకునే వీలవుతుంది. దీని నిర్మాణాన్ని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. 950 కోట్లు ఖర్చయిన వంతెన నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

రక్షణ పరంగా కూడా ఈ వంతెన అత్యంత కీలకమైనది. చైనా సరిహద్దుల్లోకి భారీ ఆయుధాలను, ఇతరత్రా  సైనిక వాహనాల తరలింపుకు ఈ వంతెన అత్యంత అనువుగా ఉంటుంది. రక్షణ అవసరాలకు తగినట్టుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. 60వేల కీలోల బరువుండే యుద్ధ ట్యాంకులను కూడా తరలించినా తట్టుకునే విధంగా నిర్మించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో సైనిక అవసరాల కోసం రోడ్డు మార్గంలో యుద్ధ వాహనాల, సామాగ్రీ తరలింపు అత్యంత కష్టసాధ్యంగా ఉండేది. రోడ్డు మార్గం అనువుగా లేకపోవడంతో జల మార్గంలో యుద్ధ ట్యాంకులను తరలించే వారు. ఇది అత్యంత వ్యయ, ప్రయాలతో కూడినది కావడంతో పాటుగా చాలా సమయం పట్టేది. ఈ  నేపధ్యంలో  నిర్మించిన ఈ భారీ వంతెన రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత పటిష్టంగా నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *