వాళ్లని ప్రజలే నియదీయాలి:హరీశ్

అభివృద్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను ప్రజలే నిలదీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలోబత్తాయి మార్కెట్‌ నిర్మాణ పనులకు  మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు అభివృద్ది నిరోధకులుగా మారారని అన్నారు. బత్తాయి మార్కెట్ కోసం స్థానిక రైతాంగం ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. భూసేకరణకు ఆటంకాలు కల్పిస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ రైతులకు సాగునీరు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతు ప్రయోజనాలకు భంగం కలిగేలా ఒక పక్క ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరో పక్క రైతుల సమస్యలను తీర్చాలంటూ ముసలి కన్నీరు కారుస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. 123 జీవోపై కోర్టులో కేసు వేసి కాంగ్రెస్‌ స్టే తెచ్చింది.. 123 జీవో ఉంటే ఉదయ సముద్రం కాలువలు తవ్వే వాళ్లమని చెప్పారు.

త్వరలోనే ఈ మార్కెట్ ను బత్తాయితో పాటుగా పూర్తి స్థాయి పండ్ల మార్కెట్ గా అభివృద్ది చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అన్ని సౌకర్యాలను అందచేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ సమస్యను అధికమించామని నిరంతరం విద్యుత్ సరఫరాను అందిస్తున్నామని అన్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రకాలుగా బ్రస్టు పట్టించారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు ఏ ముఖంపెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *