ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం:కాంగ్రెస్

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గిట్టుబాటు ధర అడిగిన పాపానికి రైతులకు తీవ్రవాదుల మాదిరిగా సంకేళ్లు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.  రైతులకు  సంకెళ్లు వేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్ ను కోరారు. కాంగ్రెస్ కు చెందిన ప్రతినిధి బృందం గవర్నర్ కు వనతి పత్రం అందచేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సురేష్ రెడ్డిలతో కూడిన బృందం గవర్నర్ ను కలిసి ప్రభుత్వం పై ఫిర్యాదు చేసింది. రైతుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులను కరడుగట్టి నేరగాళ్లుగా చూడడం దారుణన్నారు.

    గవర్నర్ ను కలిసిన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు గిట్టు బాటు  ధరను కల్పించలేని అసమర్థ  ప్రభుత్వం  అంటూ తీవ్రంగా విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి  వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికోసం గాను వేయి కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయాలన్నారు.  పొరుగు రాష్ట్రాలు కల్పిస్తున్నట్టుగా రైతులకు కనీస గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని మండిపడ్డారు. ఆరుగాలం  శ్రమించి పండిచిన రైతులు కనీస మద్దతు ధర లభించడం లేదని వారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *