బాహుబలి-2 రివ్యూ

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..? గ‌త రెండేళ్లుగా అందరినీ తొలుస్తున్న  ప్ర‌శ్న ఇది. ఇప్పుడు దీనికి స‌మాధానం తెలిసిపోయింది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుక చంపాడు…  ఎందుకు అత‌డు రాజ‌ద్రోహం చేశాడు…? భ‌ల్లాలుడు ప్రజలను ఎట్లా హింసించాడు.? తిరిగి మ‌హేంద్ర బాహుబ‌లి మాహిష్మ‌తిని ఎలా ద‌క్కించుకున్నాడు..?

బాహుబ‌లి -1 ఎక్క‌డైతే ముగిసిందో అక్క‌డ్నుంచే బాహుబలి-2 క‌థ మొద‌ల‌వుతుంది. మ‌హారాజుగా పదవి చేపట్టడానికి ముందు దేశాట‌న‌కు వెళ్లాలంటూ బాహుబ‌లిని శివ‌గామి ఆదేశిస్తుంది. అమ్మ ఆజ్ఞ ప్రకారం  దేశాటనకు వెళ్లిన  బాహుబ‌లి  అలా కుంత‌ల రాజ్యానికి వెళ్లి అక్క‌డ దేవ‌సేన‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అక్క‌డే ఆమె నివాసంలోనే ఉండిపోతాడు.  అదే స‌మ‌యంలో  మాహిష్మ‌తిలో భ‌ల్లాలుడు, బిజ్జ‌ల‌దేవుడు క‌లిసి ప‌న్నాగాలు ప‌న్నుతారు. ఆ ప‌న్నాగంలో దేవ‌సేన‌తో పాటు బాహుబ‌లి, శివ‌గామి కూడా ప‌డిపోతారు.  అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది..! అమ‌రేంద్ర బాహుబ‌లికి జ‌రిగిన అన్యాయ‌మేంటి.. అత‌న్ని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాల్సి వ‌చ్చింద‌నేది మిగిలిన క‌థ‌..!

ఎక్క‌డ క‌న్ఫ్యూజ‌న్స్ లేకుండా ఐదేళ్ల పాటు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు స్క్రీన్ పై ప్ర‌జెంట్ చేసాడు దర్శకుడు.  విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో.. ఇండియాలో ఉన్న ద‌ర్శ‌కులంద‌రికీ ఓ డిక్ష‌న‌రీలా బాహుబ‌లిని తీర్చిదిద్దాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి 2 క‌థ మొద‌లైన ఐదు నిమిషాల‌కే విజువ‌ల్ ట్రీట్ ఎలా ఉండ‌బోతుందో ప్ర‌భాస్ ఓపెనింగ్ సీన్ తోనే ప్రేక్ష‌కుల‌కు చూపించేసాడు. ఒక్క‌సారి క‌థ‌లో వెళ్ళిన త‌ర్వాత ఎక్క‌డా ఊపు త‌గ్గ‌లేదు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు క‌థ ఎక్క‌డా ఆగ‌కుండా వెళ్లిపోతుంది. బాహుబ‌లి ఇంట‌ర్వెల్ పార్ట్ మాదిరే.. ఇక్క‌డ కూడా బాహుబ‌లి అంటూ రాజ్య ప్ర‌జ‌లు అరుపుల‌తోనే ఇంటర్వెల్ వస్తుంది.

సెకండాఫ్ లోనూ క‌థ ఎక్క‌డా ప‌ట్టు జార‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు దర్శకుడు.  అయితే రెండేళ్లుగా ఇండియాను ఊపేసిన క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని చాలా ఈజీగా తేల్చేసాడు రాజ‌మౌళి. ఆ సీన్ రావ‌డానికి అర‌గంట ముందే స‌మాధానం ప్రేక్షకులకు  తెలిసిపోతుంది. ఇది స్క్రీన్ ప్లే లోపం అయి ఉండొచ్చు గానీ ఆ సీన్ వ‌చ్చిన‌పుడు మాత్రం చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు రాజ‌మౌళి. ఒక్క‌సారి బాహుబ‌లి చ‌నిపోయిన త‌ర్వాత‌.. మిగిలిన పార్ట్ అంతా సుల‌భంగా ఊహించుకోవ‌చ్చు.  విజువ‌ల్ ఫీస్ట్ తో సినిమాను నింపేశారు.  తెర‌పై క‌నిపిస్తోన్న మాయ‌ను అలా చూస్తూ ఉండిపోవ‌డం త‌ప్ప‌ ప్రేక్షకుడికి ఇంకా ఏం గుర్తు రావు.

తొలి భాగంలో శివుడిగా అల‌రించిన ప్ర‌భాస్.. ఇక్క‌డ అమ‌రేంద్ర బాహుబ‌లిగా విశ్వ‌రూప‌ం చూపించాడు. ప్ర‌భాస్ లేక‌పోతే బాహుబ‌లి లేదు అని దర్శకుడు రాజ‌మౌళి ఎందుకు అన్నాడో ఈ సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. తండ్రీ కొడుకులుగా  అద‌ర‌గొట్టాడు ప్ర‌భాస్. ముఖ్యంగా క‌ట్ట‌ప్ప త‌న‌ను చంపే సీన్ లో ప్ర‌భాస్ అభిన‌యం పీక్స్ కు వెళ్లిపోతుంది.  క‌ట్ట‌ప్ప‌తో వ‌చ్చే ప్ర‌తీ సీన్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ప్ర‌భాస్ త‌ర్వాత అనుష్క బాహుబ‌లి 2 లో కెరీర్ లో ఎప్ప‌టికీ నిలిచిపోయే పాత్ర చేసింది. తొలి పార్ట్ లో త‌మ హీరోయిన్ పాత్ర కొంచెమే ఉంద‌ని ఫీలైన ఆమె అభిమానులు పార్ట్ 2తో పండ‌గ చేసుకోవ‌చ్చు.

క‌ట్ట‌ప్ప‌గా స‌త్య‌రాజ్ న‌ట‌న తొలి భాగంతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువంటే.. సినిమాలో ఆయ‌న పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. దగ్గుపాటి రానా కూడా విల‌నిజాన్ని అద్భుతంగా పండించాడు. అయితే తొలి భాగంతో పోలిస్తే రానాకు ఇక్క‌డ స్క్రీన్ స్పేస్ త‌క్కువ‌. అయితే ఉన్న అన్ని సీన్ల‌లో రానా అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా బాహుబ‌లి సీన్ లో త‌న‌లోని రాక్ష‌సున్ని రానా బ‌య‌టికి తెచ్చిన స‌న్నివేశం మాత్రం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు.  తన కొడుకునే చంపమ‌ని క‌ట్ట‌ప్ప‌కు చెప్పిన‌పుడు శివ‌గామిగా త‌న‌లో తాను ప‌డిన అంత‌ర్మ‌థ‌నం ఆమెలోని న‌టి ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. నాజ‌ర్ బాగా చేసాడు. త‌మ‌న్నా క‌నిపించింది ఒక్క సీన్ లోనే. ఆమె గురించి చెప్ప‌డానికేం లేదు.

క‌థ గురించి.. సినిమాలో  లాజిక్ గురించి ఆలోచించ‌కుండా ఓ విజువల్ వండ‌ర్ ను ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి  బాహుబ‌లి 2 ఓ అద్భుతం. నిస్సందేహంగా ఈ సినిమా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాదు.. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ గొప్ప చిత్రరాజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *